ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది.
వర్ష సూచన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.







