భారత్, చైనా మధ్య గత రెండేళ్లుగా సంబంధాల్లో క్రమంగా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో వాస్తవాధీన రేఖ (LAC) వెంట ఇరు దేశాలు భారీగా సైనిక బలగాలను మోహరించాయి.
అయితే 2025 నుంచి సరిహద్దుల్లో చైనా సైనిక మోహరింపులో గణనీయమైన తగ్గుదల కనిపించిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించినట్లు సమాచారం. అదే సమయంలో భారత్, చైనా మధ్య రాజకీయ, దౌత్య, సైనిక స్థాయిల్లో సంప్రదింపులు పెరిగాయి.
ఇరు దేశాల మధ్య వరుసగా జరిగిన చర్చలు, ఉన్నతస్థాయి సమావేశాలు కూడా సంబంధాల మెరుగుదలకు దోహదపడినట్లు తెలుస్తోంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం కూడా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామంగా నిలిచింది.
మరోవైపు బ్రిక్స్ సదస్సులో భారత్, చైనా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య గతంలో ఉన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.







