AP: గుంటూరులో గోపి అనే వ్యక్తి మృతి వివాదాస్పదంగా మారింది. పోలీసుల హింస కారణంగానే గోపి మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కొట్టడం వల్లే గోపి ప్రాణాలు కోల్పోయాడంటూ ఆయన భార్య, తల్లి, సోదరి కన్నీటి పర్యంతమయ్యారు.
మరోవైపు గోపి మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంపై దళిత హక్కుల నేత మంద కృష్ణ మాదిగ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. పేద దళిత కుటుంబానికి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కోరారు.
గోపి మృతిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ నెల 12లోగా ప్రభుత్వం స్పందించకపోతే 15, 16 తేదీల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
గోపి మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసు శాఖ ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







