దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మెకు దిగనున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఇచ్చిన పిలుపుతో ఈ సమ్మె జరగనుంది.
ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని, పెన్షన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం బ్యాంకులు మూతపడనున్నాయి.
మరోవైపు శనివారం రెండో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. ఆ తర్వాత ఆదివారం, సోమవారం వినాయక చవితి సెలవు ఉండటంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.
అయితే డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం వంటి కొన్ని సేవలు సాధారణంగానే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.







