అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల సదస్సు రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్రంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చడం, ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా చర్యలు తీసుకోవడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ-గవర్నెన్స్ అమలు, పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల పరిష్కారం, భూ పరిపాలన, సర్వేలకు సంబంధించిన సమస్యలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులను సమర్థవంతంగా వినియోగించడంపై కూడా చర్చ జరగనుంది.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్టీజీఎస్, పీజీఆర్‌ఎస్ పనితీరును సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. జిల్లాల వారీగా పనితీరు, ర్యాంకింగ్స్‌ను పరిశీలించి కలెక్టర్లకు అవసరమైన సూచనలు, దిశానిర్దేశం చేయనున్నారు.
ఇక ఓపెన్ ఫోరంలో కలెక్టర్లతో నేరుగా మాట్లాడనున్న సీఎం.. ఆయా జిల్లాల్లో ఎదురవుతున్న ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించనున్నారు.
సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది.







