మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్

అంతర్వేది మినీ హార్బర్‌లో భారీ పండుగప్ప.. 25 కిలోల చేప రూ.28 వేలకు వేలం

ప్రచురణ తేదీ: శుక్రవారం, 4 సెప్టెంబర్ 2026

కోనసీమ: అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల వలకు భారీ పండుగప్ప (సీ బాస్‌) చేప చిక్కింది. గురువారం సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు సుమారు 25 కిలోల బరువున్న పండుగప్ప చిక్కడంతో హార్బర్‌లో సందడి నెలకొంది.

భారీ పరిమాణంలో ఉన్న చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివచ్చారు. పండుగప్పకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండటంతో దానిని దక్కించుకునేందుకు పలువురు వ్యాపారులు పోటీ పడ్డారు.

ఈ నేపథ్యంలో చేపకు బహిరంగ వేలం నిర్వహించగా.. స్థానిక వ్యాపారి రూ.28 వేల ధరకు పండుగప్పను సొంతం చేసుకున్నారు. భారీ చేప వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.