న్యూఢిల్లీ: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన బ్రిక్స్ సదస్సుకు హాజరుకానున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు.
ఈ పర్యటనలో భారత్-రష్యా సంబంధాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హార్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అదేవిధంగా అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల ప్రభావం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు తదితర కీలక అంశాలపై బ్రిక్స్ సదస్సులో విస్తృతంగా చర్చ జరగనుంది. పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.







