హీరోయిన్ నివేదా థామస్ మరోసారి గృహిణి పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రానికి ‘శ్రీమతి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బుధవారం చిత్రబృందం టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఫస్ట్ లుక్‌లో నివేదా థామస్ మిడిల్ క్లాస్ గృహిణి లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. సాధారణ కుటుంబ నేపథ్యానికి చెందిన ఓ మహిళ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, భావోద్వేగాలను ఈ సినిమా ద్వారా చూపించనున్నట్లు తెలుస్తోంది.
‘ప్రతి ఇంటి హృదయం నుంచి ఒక కథ పుడుతుంది.. అది మనందరికీ తెలిసిన, మనం ప్రేమించే.. మనం జీవించే కథ’ అంటూ చిత్రబృందం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
‘స్కైలాబ్’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఖండేరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. నివేదా థామస్ గతంలో గృహిణి పాత్రలో కనిపించిన సినిమాలకు భిన్నంగా ‘శ్రీమతి’లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిని పెంచుతోంది.



