అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి గడువు సమీపిస్తోంది. కొత్త దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 16 చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అర్హులైన వారికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర అర్హత కలిగిన వారు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు గడువు ముగిసేలోపు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు, రైస్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రంతో పాటు సంబంధిత కేటగిరీకి సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం సుమారు 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత పొందిన వారికి అక్టోబర్ 1 నుంచి పింఛన్లు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, చివరి తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులు ఆలస్యం చేయకుండా సెప్టెంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.







