హాపుర్: ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ధౌలానా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 23 ఏళ్ల కానిస్టేబుల్ ఆశిష్ తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్లో కలకలం రేగింది.
ఆశిష్ 15 రోజుల సెలవు ముగించుకుని ఇటీవలే తిరిగి విధుల్లో చేరినట్లు సమాచారం. విధుల్లో చేరిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడంతో తోటి పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
పోలీస్ స్టేషన్లో తుపాకీ పేలిన శబ్దం వినిపించడంతో సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆశిష్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఆశిష్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.







