TG: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల సాయం ప్రస్తుత నిర్మాణ ఖర్చులకు సరిపోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు, కూలీల ఖర్చులు పెరిగిపోవడంతో ప్రస్తుతం ఒక ఇల్లు నిర్మించాలంటే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతోందని ఆయన పేర్కొన్నారు.
గురువారం అసెంబ్లీలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన పలువురు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హత పొందలేకపోతున్నారని అన్నారు. ఆటోలు నడుపుకునేవారు, పాత ఇనుము అమ్ముకునేవారు, ట్రాక్టర్లతో వ్యవసాయం చేసేవారు, క్యాబ్‌లు నడిపేవారు వంటి వర్గాల ప్రజలకు కూడా పథకం ద్వారా ప్రయోజనం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ ఇళ్లకు అందించే ఆర్థిక సాయాన్ని పెంచే అంశంపై ప్రభుత్వం ఆలోచించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల సాయాన్ని మరింత పెంచితే పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం సులభతరం అవుతుందని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.







