వినాయక చవితి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పల్నాడు, విజయనగరం, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, ఏలూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో సాధారణ జనజీవనం ప్రభావితమైంది.
మరోవైపు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్–హనుమకొండ NH-163పైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పండుగ సందర్భంగా ప్రయాణాలు చేస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.







