ఢిల్లీలో ఓ అరుదైన వైద్య ఘటన వెలుగులోకి వచ్చింది. సంతానలేమి సమస్యతో చికిత్స కోసం ఆసుపత్రిని ఆశ్రయించిన 26 ఏళ్ల యువకుడి పొత్తికడుపులో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
వైద్యుల ప్రకారం, ఈ పరిస్థితిని ‘పర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్’ (PMDS) అని పిలుస్తారు. పురుషులలో అత్యంత అరుదుగా కనిపించే ఈ జన్యుపరమైన పరిస్థితికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 300 కంటే తక్కువ కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు.
పరీక్షల్లో ఈ విషయం గుర్తించిన అనంతరం వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి యువకుడి శరీరంలో ఉన్న గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ వంటి స్త్రీ పునరుత్పత్తి అవయవాలను విజయవంతంగా తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ అరుదైన కేసు వైద్య వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.







