ములుగు జిల్లా: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లాలో బంజారా తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకృతిని ఆరాధించే సంప్రదాయానికి ప్రతీకగా బంజారా గిరిజన తండాల్లో తీజ్ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పెళ్లి కాని యువతులు తొమ్మిది రోజుల పాటు నిష్ట, నియమాలతో తీజ్ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా బంజారా మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ నృత్యాలతో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి రోజున తీజ్‌ను నిమజ్జనం చేయడంతో పండుగ ముగుస్తుంది.
ఈ వేడుకలకు మంత్రి సీతక్క హాజరై బంజారా మహిళలు, యువతులతో కలిసి నృత్యం చేశారు. బంజారా సంప్రదాయ తీజ్ పండుగలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
సేవాలాల్ మహారాజ్ ఆలయానికి రూ.50 లక్షలు
బంజారా సోదరుల కోరిక మేరకు గత సంవత్సరం సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించామని మంత్రి తెలిపారు. గట్టమ్మ దేవాలయం సమీపంలో స్థలం కేటాయించడంతో పాటు ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం తరఫున రూ.50 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. భవిష్యత్‌లోనూ బంజారా సంఘాల అభివృద్ధికి, వారి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం సహకరిస్తుందని సీతక్క అన్నారు.
తీజ్ వేడుకల్లో మంత్రి సీతక్క బంజారా మహిళలు, యువతులతో కలిసి నృత్యం చేయడంతో కార్యక్రమం సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో బంజారా మహిళలు, యువతులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, బంజారా సంఘం అధ్యక్షుడు కిషన్ నాయక్, కుల పెద్దలు పోరిక గోవింద్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చింతనిప్పుల బిక్షపతి, మోహన్ లాల్, ప్రజాప్రతినిధులు, బంజారా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.







