తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం శాసనసభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ ప్రమాద బీమా పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12.91 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని భట్టి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 98 బీమా క్లెయిమ్‌లను పరిష్కరించి, బాధిత కుటుంబాలకు కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హెల్త్‌కార్డులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రమాద బీమాతో పాటు ఆరోగ్య భద్రతకు సంబంధించిన సదుపాయాలు ఉద్యోగులకు మరింత భరోసా కల్పిస్తాయని ఆయన అన్నారు.







