మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
తెలంగాణ

పెళ్లైన రెండు నెలలకే యువతి ఆత్మహత్య.. వరకట్న వేధింపులే కారణమా…?

ప్రచురణ తేదీ: బుధవారం, 2 సెప్టెంబర్ 2026

మహబూబ్‌నగర్: పెళ్లైన రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఓ యువ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు భరించలేకే తమ కుమార్తె ఈ నిర్ణయం తీసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన ఉషారాణి (20)కి దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన మల్లేష్‌తో జూన్ 25న వివాహం జరిగింది. పెళ్లైన నెల రోజులకే ఉషారాణిని వరకట్నం కోసం వేధింపులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయాన్ని ఉషారాణి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆమెకు నచ్చజెప్పారు. పరిస్థితులు సర్దుకుంటాయని భావించారు. అయితే ఇటీవల అత్తింటి వేధింపులు మరింత తీవ్రం కావడంతో ఉషారాణి పుట్టింటికి వచ్చేసింది.

ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉషారాణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మృతురాలి తల్లి పద్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. ఉషారాణి మృతికి అసలు కారణాలు, వరకట్న వేధింపుల ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు.